మానవుని వ్యవహార శైలి
మానవ సంబంధాల్లో అనివార్యమైన ఒక క్లిష్టత ఉంది. మనం అందరితో ఒకేవిధంగా ఉండలేం. కొందరితో సన్నిహితంగా, ఆత్మీయంగా ఉంటాం. మరికొందరితో ముక్తసరిగా ఉంటాం. ఇంకొందరితో సాధారణంగా వ్యవహరిస్తాం. మనపట్ల అవతలివారి ప్రవర్తనా అలాగే ఉంటుంది.ఇలా ఉండటానికి కారణం మన ప్రవర్తన లోపమా, ఇతరుల వ్యవహారశైలి మనమీద చూపే ప్రభావమా?జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి రెండూ నిజమనిపిస్తాయి. ఆదరణ-అనాదరణ, ప్రేమ-ద్వేషం, ఇష్టం-అయిష్టం, దయ-కాఠిన్యం వంటి ద్వంద్వాలు... మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టవు. ఆయా సందర్భాలను బట్టి మనకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తాం. తద్వారా మనం కొందరికి ఇష్టులం, మరికొందరికి అయిష్టులుగా ఉండిపోతాం. సర్వజనప్రియత్వం గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ఎందుకంటే అది సాధించాలంటే మనం చాలా త్యాగం చెయ్యాలి- ధనత్యాగం కాదు, మనో కాలుష్యాల త్యాగం.మనలో మనోకాలుష్యాలు ఉన్నాయని మనం ఎప్పుడూ అనుకోం. మనమీద మనకంత భరోసా. మనం ఎప్పుడూ ఎదుటివారి దోషాలమీదనే దృష్టిపెడతాం. వాటిని వేలెత్తి చూపిస్తుంటాం. ఈ దోషారోపణ పద్ధతి కూడా అంపశయ్యమీద ఆశీనుల్ని చేసినట్లు ఉండటంవల్ల మనకు తక్షణ శత్రువులు సిద్ధమైపోతారు. ఒకసారంటూ శత్రుభావం ఏర్పడ్డాక, అంత తేలిగ్గా అది తొలగిపోదు. పైకి తెలియనివ్వకపోయినా, నివురుగప్పిన నిప్పులా లోలోపల రగులుతూ ఉంటుంది. ఇది మానవ సంబంధాలను భగ్నం చేస్తుంది.దోషాలను ఎత్తిచూపటం దోషం కాదు. కానీ, అందుకు మనం అనుసరించే విధానంలోనే తేడా ఉంటుంది. కరుగ్గా, కటువుగా, కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు కదా? చేదుమందుపై చక్కెరపూత వేసి రోగిచేత మింగిస్తారు. అలాంటి పద్ధతే మనం అనుసరిస్తే ఎన్నో అపార్థాలు ఉండవు. గీతాచార్యుడు ఈ అంశాన్నే- ఏది చెప్పినా సౌమ్యంగా ప్రియంగా చెప్పాలన్నాడు. మృదువుగాను, అవసరమైన హెచ్చరికతోను చెప్పవచ్చు. అక్రూరుడి దౌత్యసంభాషణ ఇందుకు ఉదాహరణ. శ్రీకృష్ణుడి వ్యవహారశైలి ఎప్పుడూ లౌక్యంగానే ఉండేది. బుసలు కొట్టే బలరాముణ్ని పలు సందర్భాల్లో శాంతపరచటం, ఆపై తానే ఎంతో చాకచక్యంగా, సమర్థంగా కార్యాన్ని చక్కబెట్టడం... లోకానికి సందేశమే కాదు, ఆదర్శం కూడా. అందుకే శ్రీకృష్ణుడు సర్వజనప్రియుడయ్యాడు. అత్యల్పమైన జీవితకాలంలో కోపతాపాలకు, అసూయాద్వేషాలకు అతీతంగా ఉండటానికి శతవిధాల ప్రయత్నించాలి. ఇవన్నీ మనసులోని ముళ్లు. వీటిని ఎంత త్వరగా తొలగిస్తే అంత సౌఖ్యం.సౌఖ్యం అంటే సిరిసంపదలతో వచ్చేది కాదు.అందరూ మనల్ని అభిమానిస్తూ, గౌరవిస్తూ, ప్రశంసిస్తూ ఉంటే- మనకెంత సంతోషంగా ఉంటుంది! అలాంటి సంతోషానికి మనం అర్హత పొందాలంటే మనం ఇతరుల్లోని మంచిని గుర్తించి ప్రశంసించటం, అభినందించటం, ప్రోత్సహించడానికి అలవాటుపడాలి.ఇతరుల్ని మెచ్చుకుంటే మన గొప్పదనం తగ్గిపోతుందనే భావం ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సర్వజనప్రియులం కాలేం.స్వార్థం, స్వలాభంకోసం ఎదుటివారిని అతిగా పొగడటం మన వ్యక్తిత్వానికి చేటు కలిగిస్తుంది. హుందాగా, మృదువుగా, ఆత్మీయంగా, నిజాయతీగా, స్వచ్ఛమైన మనసుతో స్పందించడం సాధన చెయ్యాలి. అది మన సహజ ప్రవర్తనగా స్థిరపడాలి, సర్వజనప్రియత్వానికి ఇంతకన్నా గొప్ప విధానం మరొకటి లేదు.
Comments
Post a Comment