ముచ్చట...

ఈ సమాజం సకల జనుల సమాహారం. ఏ ఇద్దరి రూపు, చూపు, కంఠధ్వని ఒక్కలా ఉండవు. కవలల్లో కూడా హస్తరేఖలు, వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. ఇక మనస్తత్వాల సంగతి సరేసరి... ఎవరి భావాలు, వాదనలు, తీరుతెన్నులు వారివే! అరిషడ్వర్గాలకు లోనుకానివారు అరుదుగా ఉంటారు.
మనిషి స్వాభావికంగా స్వార్థపరుడు. తన జీవితం, తన చదువు, ఉద్యోగం, కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. మాటల్లో మాత్రం ‘మనందరం ఒకటే’ అంటాడు. చేతల్లో తాను, తనవాళ్లంటూ తపన పడతాడు. తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఏ కొందరో సమాజం గురించి ఆలోచిస్తారు. రేపటి తరం గురించి పాటుపడతారు. చెడును కడిగి మంచి దారి చూపిస్తారు. వారు ఆచరిస్తారు. ఆదర్శప్రాయులు అవుతారు. వారి ప్రయాణంలో అనేక కష్టనష్టాలకు గురవుతారు. అసూయతో చేసే కువిమర్శలకు కుంగిపోరు. లక్ష్యసాధన దిశగా మొక్కవోని దీక్షతో సాగిపోతుంటారు. ఆర్థిక సంబంధాలు కాలానుగుణంగా హార్దిక సమస్యలు సృష్టించవచ్చు. డబ్బు పాపిష్టిది అంటారు. అన్నదమ్ములు, ఆప్తమిత్రులు సైతం శత్రువులుగా మారిపోతారు. న్యాయస్థానాలను ఆశ్రయించి విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటారు. ఇందులో గెలుపు ఓటములుండవు. తార్కికంగా విశ్లేషిస్తే ఇద్దరూ ఓడిపోయినవారిగానే మిగులుతారు.
చాలాచోట్ల స్వార్థం, అవకాశవాదం, అతిలౌక్యం, అయాచిత ధనం రాజ్యమేలుతున్నాయి. నేటి ప్రపంచంలో శ్రమ లేకుండా ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలన్న కాంక్ష ప్రబలిపోతోంది. కారుచీకటిలో కాంతిరేఖల్లాగా కొందరు సౌజన్యమూర్తులు లేకపోలేదు. వారు తమ జీవన శైలి ద్వారా పలువురికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. గత పురాణాలు, ఇతిహాసాల్లోని పాత్రల వైవిధ్యం, వైరుధ్యం నేటి సమాజంలోనూ కనిపిస్తాయి. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం వల్లనే పరిశీలన, పరిశోధనలు అబ్బుతాయి. స్త్రీవ్యామోహం ఎలాంటి పతనానికి దారితీస్తుందో ఒక గ్రంథం వివరిస్తే, జూద వ్యసనం వల్ల రాజ్యభ్రష్టులవుతారని మరో ఇతిహాసం బోధిస్తుంది. ఎన్ని కష్టనష్టాలెదురైనా, భార్యాబిడ్డలు దూరమైనా, రాజ్యం పోయినా సత్యమార్గం వీడనని భావించి ఆచరించిన వ్యక్తి నిజంగా దైవస్వరూపుడేనని నిరూపించిన చక్రవర్తి గాథ నేటికీ చెక్కుచెదరలేదు.
కడుపున పుట్టిన బిడ్డలందరినీ అతి కిరాతకంగా, నిదురించే వేళ వధించిన దుర్మార్గుడు చేత చిక్కినా మరొక తల్లికి తనలాంటి గర్భశోకం కలిగించనన్న కారుణ్య స్త్రీమూర్తుల క్షమాగుణం ప్రశంసనీయం!
ముళ్ల కిరీటం ధరింపజేసి సిలువను వీపుపై పెట్టి హింసిస్తున్న వ్యక్తులు అమాయకులని, క్షమార్హులని భావించిన కరుణామయుల జీవితాలు ఎందరికో శిరోధార్యాలు!
పదిహేడో శతాబ్దంలో థామస్ హేవుడ్ రచించిన ‘కరుణ వల్ల కన్నుమూసిన యువతి’ (ఎ ఉమన్ కిల్డ్ విత్ కైండ్‌నెస్) అన్న నాటకం అప్పట్లో సంచలనం సృష్టించింది. వ్యసనాలకు బానిసైన ఒక భార్యను ఎలాంటి చిన్నచూపూ చూడకుండా సకల మర్యాదలతో ఆర్థికంగా భర్త ఆదుకుంటాడు. అతడి మంచితనాన్ని, త్యాగాన్ని తట్టుకోలేక గుండె పగిలి మరణించిన ఆ భార్య కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మంచి చెడుల కలయికే సమాజమని, అంతిమంగా దయ, కరుణ, త్యాగం, ప్రేమ వంటి లక్షణాలే విజయం సాధిస్తాయని చాటే సౌజన్యమూర్తులు ఎప్పటికీ చిరంజీవులే!
Comments
Post a Comment